: పంటలకు బీమానా?... ఇదో పెద్ద జోక్ మాత్రమే: కేసీఆర్
ఇండియాలో పంటలకు బీమా కల్పిస్తామన్నది పెద్ద జోక్ మాత్రమేనని, ఇప్పటివరకూ ఎప్పుడూ, ఎక్కడా అది అమలైంది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. నిబంధనలు మార్చి రైతు యూనిట్ గా పంటల బీమాను అమలు చేసినప్పుడు మాత్రమే రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు. ఈ ఉదయం తెలంగాణ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై జరిగిన చర్చకు సమాధానం చెబుతూ కేసీఆర్ మాట్లాడారు. వచ్చే మూడేళ్లలో ప్రాజెక్టులపై ఏటా రూ. 25 వేల కోట్లను ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ నిధులతో తాము చేపట్టిన అన్ని ప్రాజెక్టులనూ పూర్తి చేసి చూపిస్తామని, తెలంగాణలో ఒక్క ఎకరా భూమి కూడా నీళ్లు రాక ఎండిపోకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. బంగారు తెలంగాణ సాకారమయ్యే కల దగ్గర్లోనే ఉందని, దానికి సాక్షిగా నిలిచేందుకు ప్రతి రైతూ బతికుండాలని, ఆత్మహత్యలు కూడదని ఆయన వ్యాఖ్యానించారు.