: గాళ్ ఫ్రెండ్ పిలిస్తే వెళ్లాడు.. శవమై తిరిగొచ్చాడు!


తన గాళ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే వెళ్లిన ఒక యువకుడిని పథకం ప్రకారం హత్య చేసిన సంఘటన ముంబయి బాంద్రాలోని కార్టర్ రోడ్ వద్ద జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, మృతుడి మిత్రుడు సైఫ్ మీర్జా చెప్పిన వివరాలు... ఇరవైరెండేళ్ల రిజ్వాన్ గాళ్ ఫ్రెండ్ వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు. సోమవారం రాత్రి అతనికి ఫోన్ చేసి, కార్టర్ రోడ్ కు రమ్మనమని చెప్పింది. ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నప్పుడు రాత్రి 11 గంటల సమయం. అప్పుడు రిజ్వాన్ తన మిత్రులతో ఖార్ ప్రాంతంలోని ఒక పబ్ లో ఉన్నాడు. ఆ అమ్మాయిని కలవడానికి వెళుతున్నానని చెప్పి రిజ్వాన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే, ఆ సమయంలో వెళ్లవద్దని రిజ్వాన్ కు మిత్రులు చెప్పినా వినలేదు. దీంతో రిజ్వాన్ తో పాటు మిత్రులు కూడా కార్టర్ రోడ్డు వద్దకు వెళ్లారు. అక్కడ రిజ్వాన్, తన గాళ్ ఫ్రెండ్ మాట్లాడుకున్నారు. కొద్ది సేపటి తర్వాత వారిద్దరు వాదించుకోవడం మొదలు పెట్టారు. వాదన జరగుతున్న సమయంలో కొంత మంది వారికి సమీపంలో నిలబడి ఉండటాన్ని రిజ్వాన్ మిత్రులు గమనించారు. తర్వాత వారు మెల్లిగా నడచుకుంటూ వెళ్ళిపోయారు. ఇదంతా చూస్తున్న రిజ్వాన్ మిత్రులకు మొదట్లో ఎటువంటి సందేహం రాలేదు. కానీ, ఆ తర్వాత ఎంతసేపటికీ రిజ్వాన్ అక్కడ కనపడకపోవడంతో అతని మిత్రులు పరిగెత్తుకుంటూ వెళ్లి వెతికారు. రక్తపుమడుగులో స్పృహ తప్పి పడి ఉన్న రిజ్వాన్ ఖాన్ మృతదేహాన్ని వారు గుర్తించారు. అదే సమయంలో బైక్ లపై అక్కడి నుంచి పారిపోయేందుకు సిద్ధపడుతున్న ఐదుగురు వ్యక్తులను చూశారు. రిజ్వాన్ ను సమీపంలో ఉన్న శాంతాక్రజ్ ఆసుపత్రికి తరలించారు. రక్తస్రావం బాగా జరగడంతో అతను మృతి చెందాడని అక్కడి వైద్యులు చెప్పినట్లు పోలీసులు, రిజ్వాన్ మిత్రులు చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలంలో ఒక ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ హత్య పై రిజ్వాన్ బంధువులు మాట్లాడుతూ ఈ దారుణానికి పాల్పడింది ముమ్మాటికీ ఆ అమ్మాయేనని ఆరోపించారు. ఆ అమ్మాయిని రక్షించేందుకు పోలీసులు యత్నిస్తున్నారంటూ వారు ఆరోపించారు. ఖార్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి దత్తాత్రేయ బార్గ్ డే మాట్లాడుతూ, ఈ హత్య కేసులో ఆ అమ్మాయి హస్తముందని తాము అనుమానిస్తున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించి అందర్నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News