: ముంబై రియల్టీలో మరో రికార్డు...బీకేసీలో ఆఫీస్ కోసం రూ.1,480 కోట్లు చెల్లించిన ఫార్మా జెయింట్
ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో రికార్డుల మోత మోగుతోంది. మొన్నటికి మొన్న జతియా హౌస్ కోసం బిర్లా గ్రూపు అధినేత కుమార మంగళం బిర్లా రూ.450 కోట్లు వెచ్చించి నెలకొల్పిన రికార్డును రోజుల వ్యవధిలోనే సీరమ్ ఇన్ స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా బద్దలు కొట్టారు. లింకన్ హౌస్ ను ఆయన ఏకంగా రూ.750 కోట్లకు కొనుగోలు చేశారు. తాజాగా ఈ రికార్డును కూడా చెరిపేస్తూ దేశీయ ఫార్మా దిగ్గజం ‘అబాట్ ఇండియా’ తన ఆఫీస్ కోసం అక్షరాల రూ.1,480 కోట్లను వెచ్చించింది. గోద్రెజ్ ప్రాపర్టీస్, జెట్ ఎయిర్ వేస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘బాంద్రా-కుర్లా కాంప్లెక్స్’ (బీకేసీ)లో తన కార్యాలయం కోసం అబాట్ ఇండియా 4.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని రూ.1,480 కోట్లతో కొనుగోలు చేసింది. ఇదేదో అప్పటికే నిర్మాణం పూర్తి అయిన ఆఫీస్ కోసం ఈ మొత్తాన్ని వెచ్చించిందనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే, ప్రస్తుతం ఇంకా నిర్మాణంలోనే ఉన్న బీకేసీ వచ్చే ఏడాదిలో కాని పూర్తి కాదట. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) నుంచి జెట్ ఎయిర్ వేస్ రూ.399 కోట్లకు కొనుగోలు చేసిన రెండున్నర ఎకరాల స్థలంలో బీకేసీ నిర్మితమవుండటం గమనార్హం.