: బీహార్ ఎన్నికల్లో గెలిస్తే... బీసీ నేతను సీఎం చేస్తాం: బీజేపీ ప్రకటన
బీహార్ ఎన్నికల్లో అన్ని పార్టీలూ బీసీ మంత్రాన్ని పఠిస్తున్నాయి. ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి చెందిన లాలూ ప్రసాద్ యాదవ్ తనదైన శైలీలో దూసుకుపోతున్నారు. రిజర్వేషన్లు ఎత్తివేసినా, కోత పెట్టినా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనుకాడనని ప్రకటించిన లాలూ, బీసీ ఓటర్లను తనవైపునకు తిప్పేసుకున్నారు. రాష్ట్రంలో బలమైన సామాజికవర్గంగా ఉన్న బీసీలను ఆకట్టుకునేందుకు బీజేపీ కూడా ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ప్రతి జిల్లాలోను కనీసం ఒక్క బీసీ అభ్యర్థినైనా రంగంలోకి దించాలని తీర్మానించిన ఆ పార్టీ, తాజాగా బీసీలకు మరింత చేరువయ్యేందుకు మరో కీలక ప్రకటన చేసింది. బీహార్ ఎన్నికల్లో మూడొంతుల్లో రెండొంతుల సీట్లు వస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతనే ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తామని ప్రకటించింది. ఈ మేరకు తాము ఎన్నికల్లో విజయం సాధిస్తే అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తికి కాకుండా బీసీ కేటగిరీకి చెందిన నేతను సీఎం చేస్తామని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు.