: శాసనసభలో కాంగ్రెస్ పై రసమయి బాలకిషన్ వ్యాఖ్యలు... మండిపడిన జానారెడ్డి
తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ శాసనసభాపక్ష నేత జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రసమయి మాట్లాడుతూ, తెలంగాణ విషయంలో తమ పార్టీది కన్నతల్లి పాత్ర అయితే, మీది (కాంగ్రెస్) మంత్రసాని పాత్ర అని విమర్శించారు. దానిపై జానా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ... ఆ మాటలను అన్న సభ్యుడు తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అర్థంపర్థం లేని మాటలు మాట్లాడవద్దన్నారు. 55 సంవత్సరాలుగా దేశాన్ని కన్నతల్లిలా అభివృద్ధి చేస్తోంది కాంగ్రెస్సేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీదే కన్నతల్లి పాత్ర అని, అయినా అలా అనమని మీకు చెప్పలేమని అన్నారు. కానీ తమ పార్టీది మంత్రసాని పాత్ర అని అనడం సరికాదని హితవు పలికారు. కన్నతల్లి పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం అనే బిడ్డను ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రం ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందని తెలిపారు. దాంతో తిరిగి రసమయి మాట్లాడుతూ, తాను జానారెడ్డి వంటి అనుభవజ్ఞుడిని కాదని, కాబట్టి తనకు ఆవేశం ఎక్కువని చెప్పారు. వెంటనే కాంగ్రెస్ సభ్యులు స్పందిస్తూ, మంత్రసాని వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని రసమయి చెప్పారు.