: అంతా మీ వల్లే జరిగింది!.... మరోసారి ఆంధ్రా పాలకులపై విరుచుకుపడ్డ కేసీఆర్


తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం వల్ల ఏర్పడినవేనని, తాము ఒక్కో సమస్యనూ పరిష్కరించుకుంటూ వస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి తెలిపారు. రైతుల ఆత్మహత్యలపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ, దేశమంతటా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని గుర్తు చేసిన ఆయన, పొరుగు రాష్ట్రాల్లోనూ రైతుల మరణాలున్నాయని అన్నారు. సమైక్య రాష్ట్రంలో నీళ్ల నుంచి విద్యుత్ వరకూ అన్ని విషయాల్లో అన్యాయం జరిగినందునే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. 58 ఏళ్ల పాలనలో తెలంగాణ భయంకరమైన వివక్షకు గురైందని, తాము అధికారంలోకి వచ్చి 15 నెలలు మాత్రమే అయిందని, రాత్రికి రాత్రే సమస్యలన్నీ పరిష్కారం కావని అన్నారు. తెలంగాణకు ఇవ్వాల్సిన విద్యుత్ ను ఏపీ ఎగ్గొట్టిందని కేసీఆర్ ఆరోపించారు. నిధులు, నీళ్లు, నియామకాల విషయంలో గత పాలకులు ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని, దశాబ్దాలుగా పూర్తికాని ఎన్నో ప్రాజెక్టులు వెక్కిరిస్తున్నాయని అన్నారు. ఇండియాలో ఎక్కడా లేని విధంగా 364 విత్తన కంపెనీలు తెలంగాణ గడ్డపై ఉన్నాయని గుర్తు చేసిన ఆయన, ఏ రైతూ ఆత్మహత్యలు చేసుకోరాదని, అందరు రైతులనూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వచ్చే మార్చి తరువాత రైతులకు పగటిపూట పూర్తి కరెంటు ఇస్తామని, మూడేళ్లలో కోతలు లేకుండా చేస్తామని అసెంబ్లీ వేదికగా కేసీఆర్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News