: నల్లపాడులో జగన్ దీక్ష... సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన గుంటూరు ఎస్పీ
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే నెల 7న గుంటూరులో నిరవధిక దీక్ష చేసేందుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈ నెలలోనే దీక్ష చేపట్టేందుకు జగన్ యత్నించినా పలు కారణాలను చూపిన గుంటూరు పోలీసులు అనుమతి నిరాకరించారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో దీక్షకు దిగి ప్రజలకు అసౌకర్యం కల్పిస్తే కుదరదని చెప్పిన గుంటూరు ఎస్పీ, ఈ నెల 26న చేపట్టనున్న జగన్ దీక్షకు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో మూడు, నాలుగు ప్రాంతాల పేర్లతో కూడిన వినతి పత్రాన్ని వైసీపీ నేతలు ఎస్పీకి అందజేశారు. వాటిని పరిశీలించిన ఎస్పీ, గుంటూరు పరిధిలోని నల్లపాడులో దీక్షకు అనుమతి ఇచ్చారు. దీంతో వచ్చే నెల 7న జగన్ నల్లపాడులో దీక్షకు దిగనున్నారు.