: సమస్యలపై వీరికొక్కరికే శ్రద్ధ ఉన్నట్టు మాట్లాడుతున్నారు: టీడీపీపై కేసీఆర్ ఫైర్
తెలుగుదేశం పార్టీపై టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్ అయ్యారు. ప్రపంచంలోని సమస్యలన్నింటిపై వీరికొక్కరికే శ్రద్ధ ఉన్నట్టు టీటీడీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యలపై చర్చిస్తున్న సమయంలో, వరంగల్ ఎన్ కౌంటర్ పై చర్చ కోసం టీడీపీ పట్టుబట్టిన సందర్భంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ, ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడి కోసం వస్తున్న వామపక్షాలు, ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని... ఎన్ కౌంటర్ పై తాము వాయిదా తీర్మానాన్ని కూడా ఇచ్చామని... ఈ అంశంపై చర్చించాలని ఎర్రబెల్లి పట్టుబట్టారు. దీంతో, రెండు రోజుల పాటు రైతు సమస్యలపై చర్చించాలని బీఏసీలో నిర్ణయించామని, అందువల్ల మరో అంశంపై ఇప్పుడు చర్చించలేమని, మరో రోజు చర్చిద్దామని కేసీఆర్ బదులిచ్చారు. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది.