: విశ్వంలో మనం ఒంటరి కానేకాదు: యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ అధ్యయనం
ఈ విశాల విశ్వంలో మనం ఒంటరి వాళ్లమా? మరెక్కడా జీవం లేదా? ఉంటే ఏ రూపంలో, ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు దశాబ్దాలుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే, భూమి లాంటి గ్రహాలు ఉన్నాయని, వాటిపై జీవం ఉండే అవకాశాలూ పుష్కలమేనని కొత్త రీసెర్చ్ చెబుతోంది. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ కు చెందిన ఆస్ట్రోనోమర్, పీటర్ డ్రిస్ కోల్ ఆధ్వర్యంలో ఓ అధ్యయనం జరుగగా, నక్షత్రాల చుట్టూ తిరుగుతూ, రేడియేషన్ నుంచి రక్షణ పొందే అయస్కాంత క్షేత్రాలను కలిగివున్న గ్రహాలు ఉన్నాయని, వీటిపై జీవం ఉండివుండవచ్చని తెలిపింది. "మేం సేకరించిన ప్రాథమిక సాక్ష్యాలను బట్టి జీవం అవకాశాలపై హామీ లభించింది" అని ఆయన వివరించారు. విశ్వంలో మానవాళి ఒంటరి ఎంతమాత్రమూ కాదని ఆయన తెలిపారు. గ్రహాల చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రాలపై పీటర్ టీం జరిపిన రీసెర్చ్, అక్కడి వేడి గాలులు తదితరాలతో కూడిన ఈ అధ్యయనం వివరాలను 'ఆస్ట్రోబయాలజీ' జర్నల్ ప్రచురించింది.