: జడ్జీలకు, న్యాయవాదులకు ఎదురైన 'ట్రిక్కీ' ప్రశ్న... అగ్ని ప్రమాదం సంభవిస్తే, తల్లా? గర్ల్ ఫ్రెండా?


"ఓ భారీ అగ్నిప్రమాదం జరుగుతోంది. ఒకరినే కాపాడాలంటే ఎవరిని కాపాడతారు? తల్లినా? గర్ల్ ఫ్రెండ్ నా?"... చైనా జాతీయ న్యాయ విభాగం న్యాయమూర్తులు, న్యాయవాదుల నియామకాల నిమిత్తం నిర్వహించిన పరీక్షలో అడిగిన ఓ ప్రశ్న ఇది. "ఓ వ్యక్తి తన తల్లిని కాపాడే అవకాశాలు ఉన్నా, గర్ల్ ఫ్రెండ్ ను కాపాడేందుకు నిర్ణయించుకుంటే, నేరం చేసినట్టా?" అని అడిగారు. చైనాలో డ్రగ్ లాస్, రహదారులు, కాలుష్యం, మోసాలు, లంచం, హత్య తదితర తీవ్ర నేరాలకు సంబంధించి అభ్యర్థులు తమకిష్టమైన చాయిస్ లను ఎంచుకునే అవకాశాన్ని చైనా అందించింది. కొన్ని ప్రశ్నలు చాలా ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని వీటికి హాజరైన వారు వ్యాఖ్యానించారు. "లైఫ్ గార్డు ఉద్యోగంలో ఉండి, మునిగిపోతున్న చిన్నారిని కాపాడలేకపోతే...", "విడాకుల కేసు నడుస్తున్న వేళ, భర్త తన భార్యను ప్రమాదం నుంచి రక్షించకుంటే..." అంటూ, పలు ఊహాజనిత ప్రశ్నలను ఇచ్చి అభ్యర్థులను ఇబ్బందికర గందరగోళంలోకి నెట్టి వారి సహనానికి పరీక్షలు పెట్టింది. పరీక్షల అనంతరం ఈ ప్రశ్నలకు చైనా న్యాయశాఖ సమాధానాలు ఇచ్చింది. తల్లిని కాపాడలేకపోవడం నేరమని స్పష్టం చేయడం గమనార్హం. మునిగిపోతున్న చిన్నారిని కాపాడాల్సిన ఉద్యోగంలో ఉన్న లైఫ్ గార్డు విధి నిర్వహణలో అలక్ష్యం చూపినట్టేనని, చైనా చట్టాల ప్రకారం వ్యక్తికి తన గర్ల్ ఫ్రెండ్ కన్నా తల్లే ముఖ్యమని తెలిపింది. ఇప్పుడీ ప్రశ్నలు, సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Loading...

More Telugu News