: దొంగబ్బాయి మాయలో పడొద్దు...ఏపీ విపక్ష నేత హైదరాబాదులో ఉంటారా?: జగన్ పై లోకేశ్ ఫైర్!
టీడీపీ యువనేత, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ నిన్న ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు గుప్పించారు. ‘‘ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హైదరాబాదులో లేక మూడు నెలలవుతోంది. ఆయన ఆంధ్రాలోనే ఉంటున్నారు. మరి ప్రతిపక్ష నేత ఎక్కడ? ఆంధ్రా ప్రతిపక్ష నేతగా ఆయన హైదరాబాదులో 70 గదుల ఇంటిలో గడుపుతున్నారు. ఆయన చెప్పిన అన్ని మాటలను వినాల్సిన అవసరం మాకు లేదు’’ అని లోకేశ్ ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో నిన్న జరిగిన పార్టీ కార్యకర్తల శిక్షణా శిబిరంలో ప్రసంగించిన సందర్భంగా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘దొంగబ్బాయి మాయలో ఎవరూ పడొద్దు. ప్రతిదానికీ ఆయన అడ్డంకే. అమరావతికి భూసేకరణ వద్దంటారు. బందరు పోర్టును కాదంటారు. ఇదీ ఆయన తత్వం. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు’’ అని కూడా లోకేశ్ ప్రతిపక్ష నేతపై విరుచుకుపడ్దారు.