: కేసీఆర్ ఫాంహౌస్ ‘గ్రామం’లో రైతు అలక దీక్ష... నేతృత్వం వహించింది ఎవరో తెలుసా?
రైతు ఆత్మహత్యలపై నిన్న అసెంబ్లీలో విపక్షాల ముప్పేట దాడితో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన కేబినెట్ సహచరులు నానా ఇబ్బంది పడ్డారు. ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నా, ఓపికగా వినక తప్పలేదు. యువకుడు కాబట్టి కేటీఆర్ కు కోపమొచ్చింది కాని, మిగిలిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కిమ్మనలేదు. అయితే వీరిని ఓ ఆందోళన ముచ్చెమటలు పట్టేలా చేసింది. విపక్షాలన్నీ సభలో ఉంటే, బయట ఇంకేం ఆందోళన అంటారా? అది సాదాసీదా ఆందోళన కాదు. ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం కేసీఆర్ ను ఇరకాటంలోకి నెట్టే ఆందోళన. ఎక్కడ జరిగిందనుకుంటున్నారు? నిన్న అసెంబ్లీలో ప్రతిపక్షాల నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, అక్బరుద్దీన్ ఒవైసీలు సెటైర్లు విసిరిన కేసీఆర్ ఫాంహౌస్ సమీపంలో. మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవల్లి సమీపంలో కేసీఆర్ ఫాంహౌస్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ గ్రామంలోనే ఆ ఆందోళన జరిగింది. రైతులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్న ఈ ఆందోళనకు నేతృత్వం వహించినవారు ఎవరో తెలుసా? సీఎం సొంత నియోజకవర్గం ‘గజ్వేల్ ప్రాంత అభివృద్ధి సంస్థ(గడ)’కు సంబంధించి వ్యవసాయ శాఖ ఓఎస్ డీ అశోక్ కుమార్. సీఎం సొంత నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ అభివృద్ధిలో కీలక భూమిక పోషించాల్సిన అశోక్ కుమార్ నిన్న రైతులతో కలిసి ‘రైతు అలక దీక్ష’ చేపట్టారు. ఈ దీక్ష ప్రధాన డిమాండ్ ఏంటంటే... అధికారుల లంచాలు, అక్రమాలను నిలువరించడమేనట. అధికారుల లంచాల కారణంగానే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించిన అశోక్ కుమార్ నిన్నటి ఆందోళనలో ఉపవాస దీక్ష చేపట్టారు. రైతులకు న్యాయం జరిగేదాకా, ప్రభుత్వం రైతుల్లో భరోసా నింపేదాకా దీక్ష విరమించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. విషయం తెలుసుకున్న ‘గడ’ ప్రత్యేక అధికారి హనుమంతరావు హుటాహుటిన అక్కడకు వెళ్లి అశోక్ కుమార్, రైతులతో మాట్లాడి వారితో దీక్ష విరమింపజేశారు.