: రెండో రోజూ ప్రశ్నోత్తరాలు రద్దు...టీ అసెంబ్లీలో నేడూ ‘ఆత్మహత్య’లపైనే చర్చ
తెలంగాణ అసెంబ్లీలో అర్థవంత చర్చకు ఎట్టకేలకు గట్టి పునాదే పడిందని చెప్పాలి. రాష్ట్రాన్నే కాక దేశవ్యాప్తంగానూ పెద్ద చర్చనీయాంశంగా మారిన ‘తెలంగాణలో రైతుల ఆత్మహత్య’లపై పూర్తి స్థాయిలో చర్చకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నిన్నటి సభలో రైతుల ఆత్మహత్యలపై చర్చ కోసం ఏకంగా ప్రశ్నోత్తరాల రద్దుకు అంగీకరించిన ప్రభుత్వం రెండో రోజైన నేడు కూడా రైతు ఆత్మహత్యలపైనే పూర్తి స్థాయి చర్చకు సమ్మతించింది. ఇందుకోసం వరుసగా రెండో రోజు కూడా సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేయాలని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని కోరింది. అధికార పక్షం అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్ నేటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. నిన్నటిలాగే నేడు కూడా సభలో రైతుల ఆత్మహత్యలపైనే చర్చ జరగనుంది. నిన్న ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ నేడు ప్రకటన చేయనున్నట్లు సమాచారం.