: అంగారకుడిపై నీరున్న మాట నిజమే... ‘మామ్ అట్లాస్’ తో సుస్పష్టమన్న ఇస్రో
అంగారక గ్రహంపై జీవజాలానికి సంబంధించి కొనసాగుతున్న పరిశోధనల్లో మొన్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఆసక్తికర అంశాలను వెల్లడించింది. అంగారక గ్రహంపై నీటి జాడల విషయంలో స్పష్టమైన ఆధారాలు లభించాయని ఆ సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కూడా నిన్న ఓ విస్పష్ట ప్రకటన చేసింది. అంగారక గ్రహంపై నీటి జాడలపై మరింత స్పష్టత వచ్చిందని ఇస్రో తెలిపింది. ఈ మేరకు అంగారక గ్రహంపై పరిశోధనల కోసం గతేడాది ప్రయోగించిన ‘మామ్’ (మార్స్ ఆర్బిటర్ మిషన్) విశ్లేషణల అధారంగా ఇస్రో ‘మామ్ అట్లాస్’ ను విడుదల చేసింది. మామ్ అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించి ఈ నెల 24కు సరిగ్గా ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఇస్రో ‘మామ్ అట్లాస్’ ను ఆవిష్కరించింది. ఏడాది ప్రయాణంలో భాగంగా మామ్ అంగారక గ్రహాన్ని వివిధ కోణాల్లో ఫొటోలు తీసింది. ఈ ఫొటోల ఆధారంగానే ఇస్రో మామ్ అట్లాస్ ను విడుదల చేసింది.