: ఆ గ్రామం గూగుల్ మ్యాప్ కు దొరకలేదు!
జార్ఖండ్ లోని ఒక చిన్నగ్రామం హుటుప్. మొన్నటి వరకు ఈ ఊరు గూగుల్ మ్యాప్ లో లేదు. అందుకని, ఆ ఊరి వివరాలను వికీపీడీయాలో పొందుపరిచే బాధ్యత అక్కడి ఆడపిల్లలకు అప్పగించింది ఓ ఎన్జీవో. ఆ ఊరి గురించిన వివరాలను ఎలా అప్ లోడ్ చేయాలో అవన్నీ 'యువ' అనే ఆ ఎన్జీవో సంస్థ వారికి పూర్తిగా వివరించింది. ఇప్పుడు వికీపీడీయా లో ఈ ఊరి వివరాలు ఫొటోలతో సహా అన్నీ కనపడతాయి. హుటుప్ గురించి చెప్పాలంటే..ఇక్కడి ఆడపిల్లలు చదువు కొనసాగించడం చాలా కష్టం. దీనికి కారణం ఏమిటంటే, పదిమంది అమ్మాయిల్లో ఆరుగురికి బాల్యవివాహాలు అయిపోయి ఉంటాయి. అందుకని ‘యువ’ రంగంలోకి దిగి ఆడపిల్లల చదువు విషయంలో శ్రద్ధ తీసుకుంటోంది. క్రీడలు, అకడమిక్ ఎక్స్ లెన్స్, లీడర్ షిప్ ట్రైనింగ్ కూడా యిస్తోంది. మధ్యలో చదువు ఆపేసిన, పాఠశాల ఫీజు కట్టలేని ఆడపిల్లలను, చిన్నారులకు చదువు చెప్పేందుకుగాను నియమిస్తోంది. తద్వారా వారికి ఎంతో కొంత డబ్బులు ముట్ట చెబుతోంది. ఆ డబ్బులను ఉపయోగించుకుని మధ్యలో ఆపేసిన చదువును కొనసాగించే అవకాశం వారికి ఈ ఎన్జీవో సంస్థ కల్పిస్తోంది.