: విశాఖలో జగన్ సదస్సుకు హాజరైన ఏయూ ప్రొఫెసర్లకు నోటీసులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ విశాఖలో ఇటీవల నిర్వహించిన యువభేరి సదస్సుకు హాజరైన ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్లకు ఏపీ విద్యాశాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులకు ప్రొఫెసర్లు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదాపై నిర్వహించిన సదస్సులో మొత్తం ఆరుగురు ప్రొఫెసర్లు పాల్గొన్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని తెలిసింది. దాంతో వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారా? లేక సస్పెండ్ చేస్తారా? అని వర్శిటీ వీసీతో మంత్రి గంటా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రొఫెసర్లకు నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసులు ఇవ్వడాన్ని విద్యార్థి పరిషత్ సంఘం నిరసిస్తూ వర్సిటీ బంద్ కు పిలుపునిచ్చింది. నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే తాము రాజకీయ ప్రయోజనాలతో సదస్సుకు వెళ్లలేదని, కేవలం ప్రతిపక్ష నేత విద్యార్థుల పట్ల అనుసరిస్తున్న వైఖరి స్పష్టం చేయాలని కోరేందుకు వెళ్లామని ప్రొఫెసర్లు అంటున్నారు.