: తనను సజీవ సమాధి చేసి...గుడికట్టమన్న బాలిక
ఊరిబాగు కోసం తనకు క్షీరాభిషేకం చేసిన తరువాత తనను సమాధి చేసి, ఆ ప్రదేశంలో గుడి కట్టాలని 11 ఏళ్ల బాలిక చెప్పింది. దీంతో ఆమె చెప్పిన దానిని ఆచరించేందుకు గ్రామస్థులు ప్రయత్నిస్తుండగా పోలీసులు రంగప్రవేశం చేసి, కథకు శుభం కార్డు వేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే...ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలోని ఓ కుటుంబానికి చెందిన బాలికకు అతీత శక్తులు ఉన్నాయని గ్రామస్థులు నమ్ముతున్నారు. అందుకు కారణం ఏంటంటే, ఆ బాలిక మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆ గ్రామంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అప్పట్లో ఆ బాలిక ఒంటరిగా పంట పొలాల్లో ప్రార్థనలు చేయగా వర్షాలు కురిశాయట. దీంతో ఎనిమిదేళ్ల పాటు బాలిక మౌన దీక్షలో గడిపిందని, ఎప్పుడూ ప్రార్థనలలోనే ఉండేదని బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. తనకు క్షీరాభిషేకం చేసి, తనను సజీవ సమాధి చేసి, ఆ ప్రదేశంలో గుడి నిర్మించాలని, అలా చేస్తే ఊరు బాగుపడుతుందని ఆ బాలిక ఓ కాగితంపై రాసి చూపిందని వారు వెల్లడించారు. ఈ వార్త ఆ చుట్టుపక్కల అంతటా వ్యాపించడంతో బాలికను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. బాలిక చెప్పింది కదా అని, ఆమె చెప్పినట్టు చేయడానికి గ్రామస్థులు సిద్ధమైపోయారని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. సకాలంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో తమ బిడ్డ ప్రాణాలు దక్కాయని వారు హర్షం వ్యక్తం చేశారు.