: హైదరాబాద్ లో అసెంబ్లీ ఎదుట సెల్ టవర్ ఎక్కిన రైతు
వరంగల్ జిల్లాకు చెందిన సమ్మయ్య అనే రైతు హైదరాబాద్ లోని అసెంబ్లీ ఎదురుగా ఉన్న సెల్ టవర్ ఎక్కి కలకలం సృష్టించాడు. పురుగుల మందు చేతిలో పట్టుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అతడితో మాట్లాడే ప్రయత్నం చేశారు. తను వేసిన పంట ఎండిపోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని సమ్మయ్య డిమాండ్ చేశాడు. లేకపోతే తనకు ఆత్మహత్యే దిక్కని ఆవేదన వ్యక్తం చేశాడు. నెలరోజులుగా మంత్రులను కలవాలని ప్రయత్నిస్తున్నా పోలీసులు అడ్డుకుంటున్నారని తెలిపాడు. ఈ క్రమంలో అతను పురుగుల మందు కొంత తాగాడు. దాంతో స్పృహ కోల్పోయిన అతడిని వెంటనే పోలీసులు కిందికు దించి ఆసుపత్రికి తరలించారు.