: ఇండియాకు ఇంకేదో చేయాలని వుంది, చేస్తాను: ఫేస్ బుక్ చీఫ్ జుకర్ బర్గ్


తమకెంతో ఆదాయాన్ని ఇస్తున్న ఇండియాకు ఎంతో చేయాలని వుందని, తమపై ఉన్న బాధ్యతను నిర్వర్తిస్తామని ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు. ఇండియాలో దాతృత్వ కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచన వుందని, దీంతో పాటు మరింతమంది భారతీయులను ఆన్ లైన్ లోకి తీసుకువస్తామని ఆయన అన్నారు. "మా నుంచి ఇంకేదో కావాలని మీరు ఆశిస్తుండవచ్చు. ఫేస్ బుక్ ద్వారా ఎంతో ఆదాయాన్ని పొందుతున్న మేము అదృష్టవంతులమే. ఈ ఘనతను అందించిన ప్రపంచానికి మంచి చేయాల్సిన బాధ్యత మాపై ఉంది" అని ఆయన అన్నారు. ఇండియాలో మరింత డబ్బు వితరణ చేయడం ద్వారా పేదలు మెరుగైన జీవనానికి దగ్గరయ్యేందుకు కృషి చేస్తామని తెలిపారు. గతంలో ఎబోలా వైరస్ కు ఔషధాన్ని కనుగొనే ప్రయత్నంలో ఉన్న సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఫౌండేషన్ కు 25 మిలియన్ డాలర్లు అందించామని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇప్పటికే ఐరాస, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్లతో కలసి పనిచేస్తున్నామని తెలిపిన ఆయన, ఇండియా నుంచి పోలియోను పారద్రోలటం తదితర కార్యక్రమాలకు వేల కోట్లను ఖర్చు చేసిందని అన్నారు. ఇంటర్నెట్ భవిష్యత్తును ఊహించిన మీదటే 'నెట్ న్యూట్రాలిటీ'ని తెరపైకి తెచ్చామని, దీనిపై ఇండియాలో ఎంతో చర్చ జరిగిందని అన్నారు. నెట్ న్యూట్రాలిటీ ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డ ఆయన, తమ ఆలోచననూ సమర్థించుకున్నారు. "ఓ విద్యార్థిగా ఆలోచించండి. క్లాస్ రూములో ఉచితంగా సమాచారం అందుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. ఉచిత ఇంటర్నెట్ ఇటువంటి ఎన్నో సౌలభ్యాలను దగ్గర చేస్తుంది. దీనిపై ఆపరేటర్లే గగ్గోలు పెడుతున్నారు" అన్నారు.

  • Loading...

More Telugu News