: తెలంగాణ అసెంబ్లీలో వైఎస్ ప్రస్తావన...ఒక్క దెబ్బతో రుణమాఫీ చేశారన్న అక్బరుద్దీన్
ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ పథకాలను పరుగులు పెట్టించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి ఇప్పటికే ఏడేళ్లు కావస్తోంది. ఈ సమయంలో ఉమ్మడి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఒకే అసెంబ్లీ భవనంలో రెండు రాష్ట్రాల శాసనసభా సమావేశాలు జరుగుతున్నాయి. రాయలసీమలోని కడప జిల్లాకు చెందిన వైఎస్ గురించిన ప్రస్తావన ఏపీ అసెంబ్లీలో సర్వసాధారణమే అయినా, తెలంగాణ సభలోనూ ఆయన పేరు ప్రస్తావనకు వస్తోంది. వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపిస్తూ తెలంగాణ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కొద్దిసేపటి క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతు ఆత్మహత్యలపై జరిగిన చర్చలో పాల్గొన్న అక్బరుద్దీన్ సాగు రుణాల మాఫీని ప్రస్తావించారు. రుణమాఫీని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం విడతలవారీగా మాఫీ చేయడమేమిటని అక్బరుద్దీన్ ప్రస్తావించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రం ఒక్కదెబ్బతో రాష్ట్ర రైతుల అప్పులన్నిటినీ మాఫీ చేసేశారని ఆయన పేర్కొన్నారు.