: సహనం కోల్పోయిన కేటీఆర్... అక్బరుద్దీన్ తో వాగ్వాదం
రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాల వరుస దాడులతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) సహనం కోల్పోయారు. విపక్షాల నేతలు వరుసగా తన తండ్రి, సీఎం కేసీఆర్ ఫాంహౌస్ ను టార్గెట్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నా ఒకింత సహనంగానే ఉన్నా, అక్బరుద్దీన్ మాటల తూటాలతో ఆయన ఒక్కసారిగా ఆగ్రహోదగ్రులయ్యారు. సమస్యపై సూటిగా మాట్లాడకుండా విపక్ష నేతలు అనవసర విషయాలను ప్రస్తావిస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతు ఆత్మహత్యల నివారణపై ప్రభుత్వం సీరియస్ గానే ఉందని పేర్కొన్న కేటీఆర్, ఈ విషయంలో విపక్షాల సలహాలు, సూచనలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే విపక్షాల వాదన వింటున్నాం కదా అని పరాచికాలు ఆడితే సహించేది లేదని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు. మీడియా దృష్టిని ఆకర్షించేందుకు పరుష పదజాలంతో కూడిన వ్యాఖ్యలు కూడా సరికాదన్న రీతిలో కేటీఆర్ ఫైరయ్యారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై ఆ తర్వాత అక్బరుద్దీన్ కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. తామేం మాట్లాడాలో ప్రభుత్వంతో చెప్పించుకునేంత హీన స్థితిలో తాము లేమని స్పష్టం చేశారు. అంతేకాక తామేం మాట్లాడాలో ప్రభుత్వం నిర్దేశించాలనుకోవడం అవివేకమేనన్నారు. సభలో స్పీకర్ ఆదేశాలను పాటిస్తామని చెప్పిన ఆయన తమను కంట్రోల్ చేయాలనుకునే ప్రభుత్వం మాత్రం విఫలం కాక తప్పదని దెప్పిపొడిచారు.