: కేసీఆర్ ఫాంహౌస్ పై ఎర్రబెల్లి సెటైర్లు... పోచారంపైనా వ్యంగ్యాస్త్రాలు
తెలంగాణ అసెంబ్లీలో టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు తనదైన శైలిలో సర్కారుపై విరుచుకుపడ్డారు. రైతుల పట్ల సర్కారు వైఖరికి నిరసనగా నేటి ఉదయం అసెంబ్లీకి ఎడ్ల బండిపై వచ్చిన ఎర్రబెల్లి, సభలోనూ సర్కారుపై సెటైర్లు విసిరారు. లాభసాటి కాని సాగు వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. నీరున్న సమయంలో ప్రభుత్వం కరెంటివ్వడం లేదన్న ఆయన, రైతన్న పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవలిలోని సీఎం కేసీఆర్ ఫాంహౌస్ ను ప్రస్తావించారు. తన ఫాంహౌస్ లో ఎకరాకు రూ.కోటి రాబడి సాధిస్తున్నట్లు గతంలో కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలను ఫాంహౌస్ కు తీసుకెళితే తామూ ఆ వ్యవసాయం నేర్చుకుంటామన్నారు. అంతేకాక ఫాంహౌస్ లో ఎకరాకు రూ.కోటి రాబడి వస్తుంటే... ఇజ్రాయెల్, చైనాలకు అధ్యయనం కోసం వెళ్లడమెందుకని ఆయన ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలకు సంతాపం తెలుపుదామంటూ ఎర్రబెల్లి పిలుపునిచ్చిన సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కాస్త అసహనంగా కదిలారు. దీనిని గమనించిన ఎర్రబెల్లి ‘దగ్గెందుకు మంత్రిగారు... రైతు ఆత్మహత్యలకు సంతాపం తెలుపుదాం’ అంటూ వ్యాఖ్యానించారు.