: సల్మాన్ ఖాన్ మద్యం సేవించలేదు... ముంబై హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు


బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు సంబంధించిన 2002 హిట్-అండ్-రన్ కేసులో బాంబే హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సల్మాన్ తరపు న్యాయవాది అమిత్ మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్ మద్యం సేవించలేదని తెలిపారు. ఇప్పటిదాకా ఉన్న సాక్ష్యాధారాలు సల్మాన్ మద్యం సేవించాడని పక్కాగా నిరూపించలేకపోయాయని కోర్టుకు విన్నవించారు. "ప్రమాదం జరిగినప్పుడు సల్మాన్ పెద్ద మొత్తంలో బకార్డీ వైట్ రమ్ సేవించి ఉన్నాడని ప్రాసిక్యూషన్ చేస్తున్న వాదనలను అంగీకరించడం పెద్ద తప్పు అవుతుందని" సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ చెప్పారు. ఆ సమయంలో సల్మాన్ చేతిలో తెల్లటి రంగు ద్రవం కలిగిన గ్లాసు ఉండటంతో... అతను మద్యం తాగుతూ ఉన్నాడన్న కోణంలో కేసు బుక్ చేశారని అన్నారు. ఆ గ్లాసులో కేవలం నీరు మాత్రమే ఉందని, మద్యం లేదని చెప్పారు. ఇదే సమయంలో రెయిన్ బార్ అండ్ రెస్టారెంట్ వెయిటర్ సెమరేంద్ర సాక్ష్యాన్ని కూడా అమిత్ దేశాయ్ కోర్టు హాల్లో చదివి వినిపించారు. బకార్డీ రమ్, కాస్మోపాలిటన్ కాక్ టెయిల్ ను టేబుల్ మీద ఉంచానని సెమరేంద్ర చెప్పాడని.. అయితే, ఎంత ఉంచాడు? అన్న విషయం సాక్ష్యంలో స్పష్టంగా లేదని చెప్పారు. ఒక బాటిలా, రెండు బాటిళ్లా, పెగ్ మీద పెగ్గా, ఎన్ని సార్లు? అనే విషయాలు అందులో లేవని తెలిపారు. తాను సల్మాన్ నుంచి కాకుండా, సల్మాన్ స్నేహితుల నుంచి ఆర్డర్ తీసుకున్నానని వెయిటర్ చెప్పాడన్న విషయాన్ని కోర్టుకు గుర్తు చేశారు. బార్ లోని అన్ని టేబుల్స్ నిండిపోయాయని... 200 మంది వరకు అక్కడ ఉన్నారని, వారిలో ఎవరూ కూడా సల్మాన్ మద్యం సేవించాడని చెప్పలేదంటూ బార్ మేనేజర్ చెప్పిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి లాయర్ తీసుకువచ్చారు. కేవలం మీడియా క్రియేట్ చేసిన 'బ్యాడ్ బోయ్' ఇమేజ్ కారణంగానే సల్మాన్ ను నిందితుడిని చేశారని చెప్పారు. కాగా, "2002 సెప్టెంబర్ 28న సల్మాన్ ఖాన్ తన టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనాన్ని బాంద్రా శివార్లలోనే పేవ్ మెంట్ పైకి ఎక్కించాడు. ఈ ఘటనలో పేవ్ మెంట్ పై నిద్రిస్తున్న ఓ వ్యక్తి దుర్మరణం పాలవగా, మరో నలుగురు గాయపడ్డారు. మద్యం మత్తులోనే సల్మాన్ ఈ ప్రమాదానికి కారకుడయ్యాడు" అన్నది ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం.

  • Loading...

More Telugu News