: తెలంగాణ ధనిక రాష్ట్రం... కానీ పేద రైతులున్నారు: ఎర్రబెల్లి


తెలంగాణలో రైతు సమస్యలపై ప్రభుత్వం ప్రతిష్టకు పోతుందని టి.టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శాసనసభలో రైతు సమస్యలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు. గత ఖరీఫ్ లో పంటలు ఎండిపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని మండిపడ్డారు. రెండేళ్లుగా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని చెప్పారు. రైతు రుణమాఫీ ఒకేసారి అమలు చేస్తే బాగుండేదని సూచించారు. రాష్ట్రంలో సరైన సమయంలో వర్షాలు పడక పంట దిగుబడి శాతం చాలా తగ్గిందని పేర్కొన్నారు. మూడుసార్లు విత్తనాలు వేసినా వర్షాలు లేక మొలకెత్తలేదన్నారు. కొన్నిచోట్ల వానలు పడినా ఇబ్బందులున్నాయని తెలిపారు. కరవు మండలాల నివేదిక ఇప్పటివరకు కేంద్రానికి పంపలేదని, ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా స్వయంగా చెప్పారన్నారు. సరైన నివేదికలు ఇస్తే కేంద్రం నుంచి సాయం వస్తుందని గుర్తు చేశారు. అసలు కరవు కింద ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఇప్పటికైనా కరవు మండలాల నివేదికను పంపాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ పేద రైతులు ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. మంత్రులు పదే పదే గత ప్రభుత్వాలను విమర్శిస్తున్నారని, సాకులు చూపడంమాని రైతులను ఆదుకోవాలని సూచించారు. మొత్తం 14 వందల రైతు కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని కోరారు.

  • Loading...

More Telugu News