: బంతి బ్యాంకుల ముందుకు... స్పందిస్తే తగ్గనున్న గృహ, వాహన రుణాల కిస్తీ!


బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారంతా ఆనందించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రేట్లను తగ్గించింది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలను 'ఫ్లోటింగ్' వడ్డీ రేటు చెల్లించే ఒప్పందంపై తీసుకున్న వారందరూ లాభపడనున్నారు. ఇక ఇదే అరశాతం వడ్డీ రేట్ల కోత ప్రయోజనాన్ని కస్టమర్లకు అందిస్తే, వారు చెల్లిస్తున్న నెలసరి కిస్తీ కొంత తగ్గుతుంది. రెపో రేటు (ఆర్బీఐ నుంచి తీసుకునే నిధులపై బ్యాంకులు చెల్లించాల్సిన వడ్డీ)ను 50 బేసిస్ పాయింట్లు, రివర్స్ రెపో (బ్యాంకులు తన వద్ద దాచుకునే నిధులపై ఆర్బీఐ ఇచ్చే వడ్డీ)ను 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ వెలువడిన నిర్ణయం ఆర్థిక వ్యవస్థలోకి రూ. 70 వేల కోట్లను పంపనుంది. ఇక ఎస్ఎల్ఆర్ (స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో - నగదు నిల్వల నిష్పత్తి)ని మార్చబోవడం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్బీఐ నిర్ణయంతో నాలుగేళ్ల కనిష్ఠస్థాయిలో 6.75 శాతానికి రెపో రేటు చేరుకుంది. చైనాలో మాంద్యం నెలకొన్న వేళ, తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలు లభ్యమయ్యేలా చూస్తే, పారిశ్రామిక సంస్థలు అధిక పెట్టుబడులు పెట్టి మరింత వృద్ధి దిశగా సాగేలా చూడాలన్న ఉద్దేశంతోనే అర శాతం వరకూ వడ్డీ రేటు తగ్గించామని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వెల్లడించారు. అయితే, దేశంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన హెచ్చరించారు. ఇక బ్యాంకులు ఎంత వేగంగా స్పందించి వడ్డీ రేట్లు తగ్గిస్తాయో చూడాల్సి వుందని అన్న ఆయన వడ్డీల బంతిని బ్యాంకుల కోర్టులోకి నెట్టారు.

  • Loading...

More Telugu News