: పశ్చిమగోదావరి జిల్లాలో సినీ ఫక్కీలో కిడ్నాప్... ఛేజింగ్
పశ్చిమగోదావరి జిల్లాలో నేటి ఉదయం సినీ ఫక్కీలో ఓ కిడ్నాప్ జరగగా, సదరు కిడ్నాప్ ను గ్రామస్తులు కూడా సినీ ఫక్కీలోనే ఛేజ్ చేశారు. ఈ ఘటనలో రెచ్చిపోయిన కిడ్నాపర్లు తమను పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులతో కలబడ్డారు. అయినా ఫలితం లేకపోయింది. అయితే పోలీసులు వచ్చేలోగా ఇద్దరు కిడ్నాపర్లు తప్పించుకుని పారిపోగా ఓ కిడ్నాపర్ మాత్రం పట్టుబడిపోయాడు. వివరాల్లోకెళితే... ఉద్యోగాల పేరిట పలువురిని మోసం చేశాడన్న ఆరోపణలపై నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి వాసి సతీశ్ కోర్టు విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరాడు. అయితే అకస్మాత్తుగా అక్కడికి దూసుకువచ్చిన ఓ వాహనంలోని ముగ్గురు వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేశారు. తమ వాహనంలోకి ఎక్కించుకుని పరారయ్యేలోగానే సతీశ్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. దీనిని గమనించిన కొవ్వలి గ్రామస్తులు కిడ్నాపర్లపై తిరగబడ్డారు. ఈ క్రమంలో గ్రామస్తులను తక్కువగా అంచనా వేసిన కిడ్నాపర్లు వారితో కలబడ్డారు. అయితే గ్రామస్తుల ముందు వారి పప్పులు ఉడకలేదు. కిడ్నాపర్లను పట్టుకుని గ్రామస్తులు చితకబాదారు. వెనువెంటనే పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు అక్కడికి వచ్చేలోగానే కిడ్నాపర్లలో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. ఓ వ్యక్తి మాత్రం పోలీసులకు పట్టుబడ్డాడు.