: ఆగంతుకుని ఫోన్ కాల్ నేపథ్యంలో ముంబైలో హైఅలర్ట్


దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. నిన్న రాత్రి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఓ ఫోన్ వచ్చింది. విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్, డొమెస్టిక్ టెర్మినల్స్ ను అటాక్ చేయబోతున్నారని, అలాగే ప్రఖ్యాత తాజ్ హోటల్ ను కూడా టార్గెట్ చేశారని ఫోన్ ద్వారా హెచ్చరించారు. దీంతో, ఈ తెల్లవారుజాము నుంచి ఎయిర్ పోర్టులో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరింపజేశారు. ముంబై ఎయిర్ పోర్టుకు చెందిన 'బాంబు ముప్పు అంచనా కమిటీ' ఈ ఫోన్ కాల్ ను 'నిర్దిష్టమైన ముప్పు'గా అభివర్ణించింది. నిన్న రాత్రి ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్ కు విశేష్ కుమార్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. ఇంటర్నెట్ కాల్ ద్వారా అతను మాట్లాడాడు. అంతేకాదు, అతని వ్యక్తిగత ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీని కూడా ఇచ్చాడు. అంధేరీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు దాడుల గురించి మాట్లాడుతుండగా తాను విన్నానని ఫోన్ లో తెలిపాడు. డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, తాజ్ హోటల్ దగ్గర బాంబు పేలుళ్ల అంశంపై వాళ్లు మాట్లాడుకుంటున్నారని వెల్లడించాడు. ఒక్కో ప్రాంతంలో ఐదు వాహనాలను పేల్చే అంశంపై వారు చర్చించుకుంటున్నారని చెప్పాడు. ఈ ఉదయం 9-10 గంటల మధ్యలో దాడులకు వారు ప్లాన్ చేశారని వెల్లడించాడు. 26/11 దాడులకంటే ఈ దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ఆగంతుకులు మాట్లాడుకుంటుండగా తాను విన్నానని చెప్పాడు. దీంతో, ముంబైలో హైఅలర్ట్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News