: టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో రైతులకు అప్పులు కూడా పుట్టడం లేదు: జీవన్ రెడ్డి
టీఎస్ అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యలపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో రైతులకు మేలు కంటే, కీడే ఎక్కువగా జరుగుతోందని అన్నారు. దశల వారీగా రుణమాఫీ చేయడం వల్ల రైతులకు ఏమీ ఒరగడం లేదని మండిపడ్డారు. ఒకేసారి రుణమాఫీ చేస్తే రైతులకు కొంతైనా మేలు జరిగేదని అన్నారు. ప్రభుత్వ వైఖరితో రైతులకు అప్పులు కూడా పుట్టడం లేదని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన మద్దతు ధర రైతులకు గిట్టుబాటు కావడం లేదని అన్నారు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని అనుకున్నాం... కానీ, పరిస్థితి అలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పాలనలో విద్యుత్ బకాయిలను మాఫీ చేశామని గుర్తు చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రం కావడానికి కాంగ్రెసే కారణమని అన్నారు. రైతు రుణాలను రీషెడ్యూల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రైతులకు ఇంతవరకు ఒక్క రూపాయి అయినా సబ్సిడీని ఇవ్వగలిగారా? అంటూ మండిపడ్డారు. అనారోగ్యంతో కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అంటున్నారని... ఇది కూడా ఒక కారణం అయి ఉండవచ్చని... కానీ, తినటానికే లేని రైతు వైద్యం ఎలా చేయించుకుంటాడని ప్రశ్నించారు.