: అది మీ సమస్యే, కల్పించుకోము: మోదీతో ఒబామా
జమ్ము కాశ్మీర్ విషయంలో నెలకొన్న వివాదం భారత్, పాక్ దేశాల ద్వైపాక్షిక స్థాయి సమస్యేనని, దీనిలో తామెన్నడూ కల్పించుకోబోమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. తమపై పాకిస్థాన్ ఒత్తిడి తెచ్చినప్పటికీ, తామెన్నడూ కాశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వానికి ప్రయత్నించమని నరేంద్ర మోదీతో ఒబామా వ్యాఖ్యానించినట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ మీడియాకు తెలిపారు. సమస్యను పరిష్కరించుకుంటే రెండు దేశాల ప్రజలూ ఎంతో సంతోషిస్తారని ఆయన అన్నట్టు వికాస్ వివరించారు. ఒబామాతో పాటు యూకే ప్రధాని డేవిడ్ కెమెరాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండేలతో జరిగిన సమావేశాల్లోనూ ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతిస్తున్న తీరును మోదీ వివరించారని అన్నారు. ఆయన ప్రతి సమావేశంలోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చిందని తెలిపారు.