: ‘నల్లారి’ సోదరుడి సెకండ్ ఇన్నింగ్స్... టీడీపీలో చేరుతున్నట్లు పుకార్లు


ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన సోదరులతో కలిసి రాజకీయాలకు దాదాపుగా దూరమయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన సొంత జిల్లా చిత్తూరులో ఆయన సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి అంతా తానై చూసుకునేవారు. రాష్ట్ర విభజన తర్వాత నల్లారి స్థాపించిన సమైక్యాంధ్ర పార్టీ టికెట్ పై కిశోర్ కుమార్ రెడ్డి తమ సొంత నియోజకవర్గం పీలేరు అసెంబ్లీ బరిలో నిలిచారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత అటు కిరణ్ తో పాటు కిశోర్ కూడా దాదాపుగా రాజకీయంగా కనుమరుగయ్యారని చెప్పొచ్చు. తాజాగా కిశోర్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఏపీలో అధికార టీడీపీలో చేరేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కిశోర్ ఆసక్తిని గమనించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా ఆయన ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మరి సెకండ్ ఇన్నింగ్స్ లోనైనా కిశోర్ రాణిస్తారో, లేదో చూడాలి.

  • Loading...

More Telugu News