: డారెన్ గాఫ్, ధోనీల మధ్య 'బైక్' రేస్!
భారత క్రికెట్ వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బైకుల పిచ్చి ఎక్కువన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయం తెలియని ఇంగ్లండ్ జట్టు మాజీ క్రికెటర్ డారెన్ గాఫ్ ధోనీతో పెట్టుకున్నాడు. తన పాత సుజుకి షోగన్ బైకు ఫోటోను పోస్టు చేసిన ధోనీ, "ఈ బండి నడిపితే వచ్చే మాజానే వేరు... నడిపిన వెంటనే రిపేర్లు చేసుకోవాలి" అని ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన గాఫ్ తన ఖరీదైన డైకాటి బైక్ చిత్రాన్ని పోస్టు చేసి "నా డుకాటీ ముందెంత?" అని ప్రశ్నించాడు. దీనికి ధోనీ ఎలా స్పందించాడో తెలుసా? "నువ్వు చెప్పింది నిజమే. ఈ బండి అయితే సరిపోతుంది అనుకుంటున్నా..." అంటూ డుకాటీ కన్నా ఎంతో విలువైన కాన్ఫిడరేట్ హెల్ కాట్ బైక్ ఫోటోను పోస్టు చేశాడు. ఇక ఏం చేయాలో తెలియని గాఫ్ "ఓకే... రెండింటికీ పోటీ సరిపోతుంది" అని తప్పించుకోవాల్సి వచ్చింది. అలా సాగింది గాఫ్, ధోనీల మధ్య 'బైక్' రేస్!