: టీడీపీ జాతీయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా లోకేశ్...రేపు కమిటీలను ప్రకటించనున్న చంద్రబాబు


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుమారుడు, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కు కీలక బాధ్యతలు అప్పజెప్పేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు కమిటీలు, మొత్తంగా జాతీయ కమిటీని ఏర్పాటు చేయాలని ఇటీవలి మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రెండు రాష్ట్ర కమిటీలకు అధ్యక్షులను ఆయన ఖరారు చేశారు. ఏపీ కమిటీకి కిమిడి కళా వెంకట్రావు, తెలంగాణ కమిటీకి ఎల్.రమణల పేర్లను ఖరారు చేశారు. తెలంగాణ కమిటీకి అదనంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఏర్పాటు చేసి, ఆ బాధ్యతలను టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డికి అప్పగించేందుకు కూడా దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. రెండు రాష్ట్రాల కమిటీలతో పాటు జాతీయ కమిటీకి సంబంధించిన కార్యవర్గాలను రేపు విజయవాడలో చంద్రబాబు ప్రకటించనున్నారు. పార్టీ కార్యకలాపాల్లో ఇప్పటికే కీలకంగా వ్యవహరిస్తున్న నారా లోకేశ్ కు ఈ దఫా పార్టీలో కీలక పదవి అప్పగించాలన్న డిమాండ్ ఇటీవల పెరిగింది. పలువురు నేతలు చంద్రబాబు ముందు ఈ డిమాండ్ ను వినిపించారు. ఈ క్రమంలో నారా లోకేశ్ ను జాతీయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించేందుకు చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రేపటి పార్టీ కమిటీల ప్రకటనపై రెండు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News