: సోమనాథ్ భారతికి మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ విజ్ఞప్తి
ఢిల్లీ పోలీసులకు లొంగిపోవాలని మాజీ న్యాయశాఖ మంత్రి, ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి విజ్ఞప్తి చేసింది. సోమనాథ్ భారతి భార్య లిపిక మిత్రా ఆయనపై హత్యాయత్నం, గృహహింస కేసులు పెట్టిన నాటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. పోలీసులు పసిగట్టకుండా, ఎప్పటికప్పుడు స్థావరాలు మారుస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. మరోవైపు ఆయన తరుపు న్యాయవాదులు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. అంతేకాదు, నేటి సాయంత్రంలోపు లొంగిపోవాల్సిందిగా సోమనాథ్ భారతికి అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన అలా చేయడం బాగా లేదని ఆప్ అభిప్రాయపడింది. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టకుండా వెంటనే లొంగిపోవాలని కోరింది. చట్టంపై ఆప్ కు విశ్వాసం ఉందని పార్టీ నేత అశుతోష్ తెలిపారు. కాగా, గతంలో సాక్షాత్తు కేజ్రీవాల్ కూడా లొంగిపోవాలని కోరిన సంగతి తెలిసిందే.