: పాతికేళ్లు పూర్తి చేసుకున్న బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తన సీనీ జీవితంలో పాతికేళ్ల కెరీర్ ను పూర్తి చేసుకున్నాడు. 48 ఏళ్ల అక్షయ్ విభిన్న పాత్రలను పోషించి దేశ, విదేశాల్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా... 'హరి ఓమ్ ఎంటర్ టైన్ మెంట్' పేరుతో సొంత బ్యానర్ ను స్థాపించి పలు చిత్రాలను కూడా నిర్మించాడు. ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ, తన సినీ ప్రయాణం అద్భుతంగా సాగిందని అన్నాడు. రానున్న రోజుల్లో కూడా నటనను, సినీ నిర్మాణాన్ని కొనసాగిస్తానని చెప్పాడు. అయితే, ఎన్నటికీ దర్శకత్వ బాధ్యతలను మాత్రం చేపట్టనని స్పష్టం చేశాడు. ఈ శుక్రవారం అక్షయ్, అమీ జాక్సన్ నటించిన 'సింగ్ ఈజ్ బ్లింగ్' సినిమా విడుదల కాబోతోంది.