: మూడు నిమిషాల్లో రూ. 50 వేల కోట్లు హాంఫట్!
మధ్యాహ్నం 2:46 గంటలు... సెన్సెక్స్ సూచిక 25,790 పాయింట్ల వద్ద ఉంది. సరిగ్గా మూడు నిమిషాల తరువాత 2:49 గంటలకు 25,669 పాయింట్లకు చేరి 120 పాయింట్లకు పైగా పతనం కాగా, ఈ వ్యవధిలో రూ. 50 వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. సెషన్ ఆరంభం నుంచి ఒడిదుడుకుల మధ్య పడుతూ, లేస్తూ వచ్చిన సూచికలు మధ్యాహ్నం 2 గంటల తరువాత అమ్మకాల ఒత్తిడిలోకి వెళ్లిపోయాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ వాటాలు విక్రయించేందుకే మొగ్గు చూపారు. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 246.66 పాయింట్లు పడిపోయి 0.95 శాతం నష్టంతో 25,616.84 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచిక 72.80 పాయింట్లు పడిపోయి 0.93 శాతం నష్టంతో 7,795.70 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.23 శాతం, స్మాల్ క్యాప్ 0.24 శాతం నష్టపోయాయి. డాక్టర్ రెడ్డీస్, ఐడియా, లుపిన్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ తదితర కంపెనీలు లాభపడగా, టాటా మోటార్స్, వీఈడీఎల్, కోల్ ఇండియా, అల్ట్రా సిమెంట్స్, సన్ ఫార్మా తదితర కంపెనీలు నష్టపోయాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 94,76,024 కోట్లకు తగ్గింది.