: మార్స్ రహస్యాన్ని కనుగొన్నాం: నాసా
అంగారక గ్రహం (మార్స్) రహస్యాన్ని కనుగొన్నామని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. తాము జరుపుతున్న మార్స్ ఎక్స్ ప్లొరేషన్ మిషన్ లో భాగంగా అత్యంత ముఖ్యమైన విషయాన్ని తెలుసుకున్నామని చెబుతూ "మార్స్ మిస్టరీ సాల్డ్వ్" అంటూ నాసా తెలిపింది. ఈ రోజు ఉదయం 11:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి 9 గంటలకు) ప్రత్యేక మీడియా సమావేశంలో వివరాలను తెలియజేస్తామని, వాషింగ్టన్ లోని నాసా కేంద్ర కార్యాలయంలోని జేమ్స్ వెబ్ ఆడిటోరియంలో ఈ సమావేశం జరుగుతుందని వెల్లడించింది. ఈ ఈవెంటును నాసా వెబ్ సైట్ మాధ్యమంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపింది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కు నాసా డైరెక్టర్ జిమ్ గ్రీన్, మార్స్ ఎక్స్ ప్లోరేషన్ లీడ్ సైంటిస్ట్ మైఖేల్ మేయర్ తదితరులు హాజరవుతారని వివరించింది. కాగా, నాసా ఏం కనుగొని వుంటుందన్న విషయమై సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు పెరుగుతున్నాయి. మార్స్ పై జీవం ఉందని నాసా కనుగొని ఉండవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను చూపించవచ్చని భావిస్తున్నారు. ఏదిఏమైనా మిస్టరీ వీడాలంటే మరో ఐదు గంటలు ఆగాల్సిందే.