: పోలీసుల నిర్లక్ష్యానికి వికలాంగుడు మృతి


పోలీసుల నిర్లక్ష్యానికి పెద్ద పుల్లన్న అనే వికలాంగుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం పి.లింగాపురంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన పెద్ద పుల్లన్న నాటు సారా అమ్ముతూ ఇటీవల పోలీసులకు చిక్కాడు. దీనికి సంబంధించి పుల్లన్నను నిన్న పోలీస్ స్టేషన్ కు పిలిపించి చితకబాదారు. మరుసటి రోజు కూడా స్టేషన్ కు రావాలని చెప్పి నిన్న వదిలేశారు. పోలీస్ స్టేషన్ కు వెళ్తే మళ్లీ చితకబాదుతారేమోననే భయంతో పుల్లన్న భయపడిపోయాడు. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. స్టేషన్ కు వెళ్లగానే స్పృహతప్పి పడిపోయాడు. అయితే, మందు (సారా) ఎక్కువై ఉంటుందని భావించిన పోలీసులు పుల్లన్నను బయటపడేశారు. కాసేపటి తర్వాత గానీ, పుల్లన్న పురుగుల మందు తాగి వచ్చాడనే విషయం పోలీసులకు అర్థం కాలేదు. దీంతో, అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ, ఆసుపత్రికి చేరుకునే లోపే పుల్లన్న కన్నుమూశాడు. స్పృహ కోల్పోయిన వెంటనే పుల్లన్నను పోలీసులు ఆసుపత్రికి తరలించి ఉంటే అతను బతికి ఉండేవాడు. పోలీసుల నిర్లక్ష్యం ఖరీదు ఓ నిండు ప్రాణం.

  • Loading...

More Telugu News