: బాలిక కొంప ముంచిన గ్రీన్ టీ!
టీవీ పెట్టామంటే చాలు... సన్నబడాలనుకుంటున్నారా? అయితే మా ప్రొడక్ట్ వాడండి...ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గించుకోండి... అంటూ తెల్లారి లేచింది మొదలు, రాత్రి నిద్రపోయేవరకు చెవులు చిల్లులుపడేలా యాడ్స్ ప్రసారమవుతూనే ఉంటాయి. అలాంటి యాడ్ కు ఆకర్షితురాలైన ఓ బాలిక బరువు తగ్గాలని భావించి, చైనాకు చెందిన ఓ కంపెనీకి చెందిన గ్రీన్ టీకి ఆర్డరిచ్చి తెప్పించుకుని, రోజుకు మూడు కప్పుల చొప్పున మూడు నెలలుగా తాగింది. ఒళ్లు తగ్గడం మాట అటుంచి, బాలిక అస్వస్థతకు గురైంది. కడుపు నొప్పి, కండరాల నొప్పితో ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు పచ్చకామెర్లు సోకాయని తేల్చారు. అది కూడా గ్రీన్ టీ కారణంగానే పచ్చకామెర్లు వచ్చాయని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో తరచూ చోటుచేసుకుంటున్నాయని బ్రిటిష్ జర్నల్ కథనం ప్రచురించింది. గ్రీన్ టీ తాగడం ఆపేయగానే బాలిక కోలుకుందని వైద్యులు తెలిపారు.