: ఇబ్బడి ముబ్బడిగా రాబడి... భారత మార్కెట్ పై నిపుణుల అభిప్రాయాలు
గత కొంత కాలంగా భారత స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం లోపించింది. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీలు 52 వారాల కనిష్ఠానికి దగ్గరలో ఉన్నాయి. అయినా, ప్రముఖ ఇన్వెస్టర్లు, రీసెర్చ్ సంస్థల నిపుణులు నమ్మకంగానే ఉన్నారు. భారత మార్కెట్ వచ్చే ఐదారేళ్లలో భారీగా పెరిగి పెట్టుబడులపై ఇబ్బడి ముబ్బడిగా రాబడిని అందిస్తుందని అంచనా వేస్తున్నారు. భారత మార్కెట్ పై ఎవరేమంటున్నారంటే... "భారత బుల్స్ ఎంతటి శక్తిమంతమో నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. వచ్చే ఏడు లేదా ఎనిమిదేళ్లలో ఇండియా 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందనడంలో సందేహం లేదు. ఈక్విటీ మార్కెట్లు గొప్ప లాభాలను అందించనున్నాయి." - రాకేష్ ఝున్ ఝున్ వాలా, ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్. "ఎంత అన్నది చెప్పలేం గానీ, ఇండియాలోని కుటుంబాల నుంచి పెద్దఎత్తున పొదుపు నిధులు ఈక్విటీ మార్కెట్లలోకి మ్యూచువల్ ఫండ్ మార్గాన రానున్నాయి. ఈ డబ్బు మార్కెట్ ను మరింత ఉన్నతికి తీసుకెళ్తుంది." - వికాస్ ఖేమాని, ప్రెసిడెంట్, ఎడిల్ వైజెస్. "సమీప భవిష్యత్తులో మార్కెట్ దూసుకుపోతుందని నమ్ముతున్నాను. ఎన్నిరకాల అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినా, భారత ఆర్థిక మూలాలు బలంగా ఉన్న కారణంగా వెనుకంజ వేసే ప్రసక్తే లేదు." - హర్షా ఉపాధ్యాయ, సీఐఓ, కోటక్ ఏఎంసీ. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే వేగంగా ఎదుగుతూ, వృద్ధి గణాంకాల విషయంలో సైతం ముందున్న ఇండియాలో స్టాక్ మార్కెట్లు మంచి నియంత్రణలో ముందుకు సాగడం సత్ఫలితాలను అందిస్తుందని మార్కెట్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, స్వల్ప కాల లాభాలపై కాకుండా, దీర్ఘకాల సంపద సృష్టి నిమిత్తం భారత మార్కెట్ ను ఆశ్రయిస్తే లాభం ఎక్కువగా ఉంటుందన్నది వీరి సలహా.