: ఇక చివరిగా ఒబామాతో మోదీ... రెండు దేశాలకూ కీలకమే!


ఊపిరి సలపని బిజీ షెడ్యూలుతో అమెరికా అంతా చుట్టిన భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేటితో ముగియనుంది. ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలు, టెక్ దిగ్గజాలు, భారత సంతతి ప్రజలను కలుసుకున్న ఆయన చివరిగా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిసి, చర్చలు జరిపి తన రెండవ అధికార యూఎస్ పర్యటనకు ముగింపు పలకనున్నారు. అమెరికా నుంచి అణు ఇంధనం, ముడిచమురు వెలికితీత తదితర విభాగాల్లో మరింత సాంకేతిక సహాయం కోరాలని ఇండియా భావిస్తుండటం, ఇదే సమయంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై పరిమితులు తొలగింపు, పన్ను రాయితీలూ ఉంటే, అపారమైన భారత మార్కెట్ లో సులువుగా దూసుకెళ్లవచ్చని అమెరికా భావిస్తుండటంతో ఇరు దేశాలకూ ఒబామా, మోదీల భేటీ కీలకంగా మారింది. గడచిన సంవత్సరం వ్యవధిలో ఇరు దేశాల నేతలు మూడుసార్లు కలిసి వివిధ అంశాలపై చర్చలు జరిపారు. మరో సంవత్సరంలో అమెరికాలో ఎన్నికలు జరిగి అధ్యక్ష పదవి మరొకరి చేతుల్లోకి వెళ్లనుండటంతో, కొంత ఆచితూచి వ్యవహరించాలని భారత్ భావిస్తోంది. ఒబామా, మోదీ భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు ప్రధాన అంశాలుగా ఉంటాయని సమాచారం. ఇండియా నుంచి వచ్చే వారికి ఎదురవుతున్న వీసా సమస్యలనూ మోదీ ప్రధానంగా ప్రస్తావించే అవకాశాలున్నాయి. హె-1బీ ప్రొఫెషనల్ వీసా ఫీజులను తగ్గించాలని మోదీ కోరనున్నారని తెలుస్తోంది. అదే జరిగితే ఐటీ ఇండస్ట్రీకి అతిపెద్ద లాభం చేకూరినట్లవుతుంది. దీంతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న 'టోటలైజేషన్' ఒప్పందంపై ఇరు దేశాలూ సంతకాలు చేసే అవకాశాలున్నాయి. ఈ ఒప్పందం కుదిరితే, అమెరికాలో కొంత కాలం ఉండి తిరిగి స్వదేశానికి వచ్చే వారికి మేలు కలుగుతుంది. అమెరికాలో ఉన్న సమయంలో సామాజిక భద్రత నిమిత్తం వారు వెచ్చించిన డబ్బు తిరిగి దేశం వీడే సమయంలో చేతికి అందుతుంది. ఐపీఆర్ (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) పాలసీ, ఇరు దేశాల మధ్యా స్వేచ్ఛా వాణిజ్యం అంశాలు కూడా ప్రస్తావనకు రావచ్చని సమాచారం.

  • Loading...

More Telugu News