: కలిసి వస్తే ఓకే...లేదంటే టీఆర్ఎస్ ను తరిమికొడతాం: గద్వాలలో డీకే అరుణ
పాలమూరు జిల్లాలోని గద్వాలను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ డిమాండ్ చేశారు. గద్వాల జిల్లా సాధన పేరిట ఇటీవల ప్రారంభించిన ఉద్యమంలో భాగంగా నేడు ఆమె గద్వాల బంద్ కు పిలుపునిచ్చారు. ప్రస్తుతం గద్వాలలో బంద్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ గద్వాల జిల్లా సాధన కోసం టీఆర్ఎస్ తమతో పాటు కలలిరావాలని డిమాండ్ చేశారు. జిల్లా సాధన కోసం టీఆర్ఎస్ నేతలు ముందుకు వస్తే, వారి వెంట నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆమె ప్రకటించారు. అయితే టీఆర్ఎస్ ముందుకు రాని పక్షంలో గద్వాల నుంచి ఆ పార్టీని తరిమికొడతామని ఆమె హెచ్చరించారు.