: డ్వాక్రా మహిళలకు ‘అమ్మ’ ఫోన్లు... రూ.15 కోట్లతో 20 వేల ఫోన్లు కొనుగోలు
తమిళనాడు సీఎం జయలలిత మరో కొత్త పథకానికి రూపకల్పన చేశారు. ఇప్పటికే ‘అమ్మ’ పేరిట ప్రారంభమైన పలు పథకాలకు ఆ రాష్ట్రంలో భారీ స్పందన వచ్చింది. జయలలిత సర్కారు ప్రవేశపెట్టిన పథకాలపై దేశవ్యాప్తంగానూ పెద్ద చర్చే నడుస్తోంది. తాజాగా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు జయలలిత ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక స్వావలంబనపై తర్ఫీదునిచ్చేందుకు ప్రత్యేకంగా ట్రైనర్లను నియమించనున్నారు. వీరికి ప్రత్యేక సాఫ్ట్ వేర్ తో రూపొందించిన మొబైల్ ఫోన్లను అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలు కోసం మొత్తం 20 వేల ఫోన్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జయలలిత సర్కారు రూ.15 కోట్లను వినియోగించనుందట.