: రైతు ఆత్మహత్యలపై ప్రకటన చేయనున్న కేసీఆర్... ప్రశ్నోత్తరాలు లేకుండానే రేపటి సభ
తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు లేని రోజంటూ లేదు. నిత్యం రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట రైతుల బలవన్మరణాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వీటిపై సర్కారు నోరు మెదపకున్నా, ప్రతిపక్షాలు మాత్రం విరుచుకుపడుతున్నాయి. అయితే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల అసలు వేడి రేపటి నుంచి మొదలు కానుంది. ఈ నెల 23న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డిల మృతిపై సంతాపం ప్రకటించి ఈ నెల 29కి వాయిదా పడ్డాయి. రేపు ఉదయం అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. అయితే తమపై విపక్షాలు దాడి చేయకముందే ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించనుంది. రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతుల ఆత్మహత్యలపై ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు ఆయన తన ప్రకటనను సిద్ధం చేసుకున్నారు కూడా. ఇందుకోసం రేపటి సభలో అసలు ప్రశ్నోత్తరాలే ఉండవట. మరి కేసీఆర్ ప్రకటనపై విపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.