: ఎర్రబెల్లికి 14 రోజుల రిమాండ్... బెయిల్ పై జనగామ కోర్టులో వాదనలు
టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావుకు వరంగల్ జిల్లా జనగామ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిన్న తన సొంత నియోజకవర్గం పాలకుర్తిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పర్యటన సందర్భంగా టీఆర్ఎస్, టీ టీడీపీ కార్యకర్తల మధ్య భారీ ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఓ ఎస్సైకి రక్త గాయాలయ్యాయి. దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న ఎర్రబెల్లిని పోలీసులు అరెస్ట్ చేసి జనగామ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నేటి ఉదయం జనగామ కోర్టులో ఎర్రబెల్లిని హాజరుపరచగా, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే అప్పటికప్పుడు ఎర్రబెల్లి తరఫున ఆయన న్యాయవాదులు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై ప్రస్తుతం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. బెయిల్ లభించని పక్షంలో ఎర్రబెల్లి జైలుకెళ్లక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో టీ టీడీపీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.