: తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. టి.స్పీకర్ పరిధిలో ఈ అంశం ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఈ అంశంపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. 2014 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి గెలుపొందిన ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలు తరువాత పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరారు. దాన్ని సవాల్ చేస్తూ ఇరు పార్టీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఫిరాయింపుదారులను అనర్హులుగా ప్రకటించాలని కోరాయి. పిటిషన్ పై పలుమార్లు విచారించిన తరువాత చివరికి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పిటిషన్ ను తోసిపుచ్చింది.