: సాలీనా రూ. 4 లక్షలకు పైగా సంపాదిస్తున్నారా? మీపై ఆదాయపు పన్ను నిఘా ఉంది సుమా!
చిన్న, మధ్య తరహా పట్టణాల్లో నివసిస్తున్న వారు సహా, సంవత్సరానికి రూ. 4 లక్షలకు పైగా సంపాదిస్తూ, పన్నులు చెల్లించకుండా ఉన్నవారిపై ఆదాయపు పన్ను శాఖ విభాగంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నిఘా పెట్టింది. ఈ తరహా జాబితాలో మీరు ఉన్నారా? సీబీడీటీ అధికారుల నుంచి మీకు ఏ క్షణమైనా తాఖీదులు రావచ్చు. మరింత మంది నుంచి పన్ను వసూళ్లు చేయాలని భావిస్తున్న సీబీడీటీ రిటర్నులు దాఖలు చేయని వారిని గుర్తించి, వారితో పన్నులను కట్టించేందుకు రంగంలోకి దిగింది. చెల్లించాల్సిన పన్ను స్వల్పమే అయినా, ఈ జాబితాలో కనీసం కోటి మంది వరకూ ఉంటారని, వీరి నుంచి పన్ను వసూలు చేయడం ద్వారా సులువుగా లక్ష్యాలను చేరుకోవచ్చన్నది తమ అభిమతమని సీబీడీటీ చైర్ పర్సన్ అనితా కపూర్ వెల్లడించారు. "పన్ను పరిధిలోకి వచ్చేలా ఆదాయం సంపాదిస్తున్న వారు రిటర్నులు దాఖలు చేయాలన్నదే మా ఉద్దేశం. టైర్ -2, 3 తరహా పట్టణాలకు చెందిన వారిలో సంవత్సరానికి రూ. 4 లక్షలు పైగా సంపాదిస్తూ పన్ను కట్టని వారు లక్షల్లో ఉన్నారు. వీరందరి జాబితాను సమీకరిస్తున్నాం" అని తెలిపారు. పన్ను పరిధిలో ఉండిన వారు, అంటే, రూ. 4 లక్షలకు పైగా సంపాదిస్తున్న వారిలో 20 శాతం వరకూ తప్పించుకు తిరుగుతున్నట్టు ఓ అధ్యయనంలో తమకు తెలిసిందని అనితా కపూర్ వివరించారు. తమ సిబ్బంది మార్కెట్ లావాదేవీలను పరిశీలిస్తున్నారని, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు వెళ్లి, పన్నులు ఎగ్గొడుతున్న వారి మనసులు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె తెలిపారు. చిన్న మొత్తాలైనా పన్నులు చెల్లించని వారి వల్ల, పన్నులు చెల్లిస్తున్న వారిపై ఒత్తిడి పెరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. పన్నులు చెల్లించాలని ప్రజలను తాము వేధించబోమని, వారి బాధ్యతను గుర్తు చేయాలన్నది మాత్రమే తమ అభిమతమని కపూర్ తెలిపారు.