: ఓంకార క్షేత్రంలో ఉద్రిక్తత... అటవీ శాఖ సిబ్బందిపై తిరగబడ్డ భక్తులు


ఓంకార నినాదం వినిపించాల్సిన క్షేత్రంలో పోలీసుల బూట్ల చప్పుళ్లు, భక్తుల నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. ఆలయ మండపాన్ని కూల్చేందుకు వచ్చిన అటవీ శాఖాధికారులను భక్తులు అడ్డుకున్నారు. అంతేకాక అటవీ శాఖ సిబ్బందికి చెందిన రెండు బేస్ క్యాంపులకు భక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఓంకార క్షేత్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకెళితే... కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలోని ఓంకారంలో ఏర్పాటైన శివాలయానికి ఇటీవల భక్తుల రద్దీ పెరిగింది. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ అక్కడ ఓ కల్యాణ మండపాన్ని నిర్మించింది. ఈ మండపంలో ఇటీవల పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయితే ఈ మండపం అటవీ శాఖకు చెందిన స్థలంలో నిర్మితమైందట. ఇదే అంశాన్ని లేవనెత్తిన అటవీ శాఖాధికారులు మండపాన్ని తొలగించాలని ఆలయ కమిటీకి సూచించారు. అయితే ఆలయ కమిటీ అటవీ శాఖ ఆదేశాలను అంతగా పట్టించుకోలేదు. దీంతో ఆ మండపాన్ని తొలగిస్తామంటూ నిన్న అటవీ శాఖాధికారులు సరంజామాతో అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న సమీప గ్రామాల భక్తులు అటవీ శాఖ సిబ్బందిని అడ్డుకున్నారు. అయినా ముందడుగు వేసేందుకు యత్నించిన అటవీ శాఖ సిబ్బంది చర్యను నిరసిస్తూ ఆందోళనకు దిగిన భక్తులు ఆ శాఖకు చెందిన రెండు బేస్ క్యాంపులకు నిప్పు పెట్టారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News