: షూలో రహస్య కెమెరా పెట్టి, మహిళల చిత్రాలు తీస్తూ బుక్కయిన న్యాయవాది
అతను ప్రముఖ కార్పొరేట్ కంపెనీలకు న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. హర్యానా కన్స్యూమర్ ఫోరమ్ మాజీ అధ్యక్షుడి కుమారుడు. సంఘంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. అయితేనేం, బుద్ధి వక్రించింది. ఓ స్పై కెమెరా కొన్నాడు. దాన్ని షూలో అమర్చి మహిళల చిత్రాలను అభ్యంతరకరంగా తీస్తూ దొరికిపోయాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ న్యాయవాది దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రముఖ మాల్ కు వెళ్లాడు. అక్కడి ఓ స్టోర్ మేనేజర్ కు ఇతని ప్రవర్తనపై అనుమానం వచ్చింది. మహిళల పక్కన, అందునా చీరలు ధరించిన వారి పక్కన కదులుతుండటం, అతని కుడి అడుగు వేస్తున్నప్పుడల్లా, మహిళల కాళ్ల సమీపానికి పాదాన్ని తీసుకువెళుతుండటంతో నిలదీసి ప్రశ్నించాడు. సెక్యూరిటీ గార్డులు వచ్చి బూట్ లో దాచివున్న కెమెరాను కనుగొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టి విచారణ జరుపుతున్నట్టు సౌత్ ఢిల్లీ డీసీపీ ప్రేమ్ నాథ్ వెల్లడించారు. అతని వద్ద 12 అభ్యంతరకర క్లిప్స్ వున్నాయని, వాటిని ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశాడా? అన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని వివరించారు.