: ఫుట్ బాల్ ఆటగాడి ప్రాణాలు నిలిపిన స్మార్ట్ వాచ్!
చేతికి ధరించిన ఓ స్మార్ట్ వాచ్, గుండె కొట్టుకుంటున్న వేగాన్ని గురించి హెచ్చరించి ఓ యువ ఫుట్ బాల్ క్రీడాకారుడి ప్రాణాలు నిలిపింది. ఈ ఘటన యూఎస్ లోని మసాచుసెట్స్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఫుట్ బాల్ శిక్షణా తరగతులకు హాజరైన పాల్ హౌల్ (18), తనకు స్వల్పంగా వెన్నునొప్పి వస్తోందని గుర్తించాడు. "శిక్షణ వల్ల నొప్పి వచ్చిందిలే" అనుకుంటూ, ఇంటికి వెళ్లాడు. తన యాపిల్ గడియారంలో, "నీ గుండె నిమిషానికి 145 సార్లు కొట్టుకుంటోంది" అని వచ్చింది. తొలుత గడియారం తప్పుగా చూపుతుందిలే అని అనుకున్నా, శిక్షకుడు, నర్సులు చూసి, పరిస్థితి విషమిస్తోందని భావిస్తూ అత్యవసర చికిత్సకు తరలించారు. కఠోర శిక్షణ చేయడంతో కండరాల కణాలు దెబ్బతిని రక్తంలోకి ప్రొటీన్లు చేరుతున్నాయని, దీంతో ఒక్కో అవయవం విఫలమై ప్రాణాలు పోతాయని వైద్యులు తేల్చారు. అతనికి చికిత్సను అందించి ప్రాణాలు నిలిపారు. ఈ విషయం అటూ ఇటూ తిరిగి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కు చేరింది. హౌల్ కు ఓ సరికొత్త ఐఫోన్, వేసవి ఇంటర్న్ షిప్ ను కానుకగా ఇస్తున్నట్టు టిమ్ ప్రకటించారు.