: దేశం కోసమే జీవిస్తా... దేశం కోసమే మరణిస్తా: శాప్ సెంటర్ లో మోదీ ఉద్వేగ వ్యాఖ్య


ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల కోసం అగ్రరాజ్యం అమెరికా వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ కాస్తంత ఉద్వేగానికి లోనవుతున్నారు. నిన్నటికి నిన్న ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్ తో చిట్ చాట్ సందర్భంగా తన తల్లిని గుర్తు చేసుకుని కంటతడిపెట్టిన మోదీ, తాజాగా కాలిఫోర్నియాలోని శాప్ సెంటర్ లో ప్రసంగం సందర్భంగా ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. తొలుత కాస్తంత సాధారణ వ్యాఖ్యలతోనే ప్రారంభమైన ఆయన ప్రసంగం క్రమంగా ఉద్వేగభరితంగా మారింది. ‘ఈ దేహం దేశం కోసమే. దేశం కోసం జీవిస్తా. దేశం కోసం మరణిస్తా’’ అని మోదీ వ్యాఖ్యానించారు. అంతకుముందు స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ పేరును ప్రస్తావించిన ఆయన భగత్ సింగ్ జన్మదినం నేడేనని గుర్తు చేశారు. పేదరికం లాంటి అనేక సమస్యలున్నా... దేశం ప్రగతి పథంలో దూసుకెళుతోందని ఆయన అన్నారు. ఉపనిషత్తుల స్థాయి నుంచి ఉపగ్రహాలు ప్రయోగించే స్థాయికి చేరుకున్నామన్నారు. ఉపగ్రహాల ప్రయోగాల కోసం డబ్బును వృథా చేస్తున్నారని గతంలో విమర్శలు వస్తే, ప్రస్తుతం అవే ఉపగ్రహాల ప్రయోగంతో భారీ సంపాదన రాబట్టే స్థాయికి చేరుకున్నామన్నారు. మామ్ లాంటి భారీ ఉపగ్రహాల ప్రయోగంలో తొలి యత్నంలోనే భారీ విజయాన్ని నమోదు చేశామన్నారు. 800 మిలియన్ల యువత ఉన్న భారత్ తలచుకుంటే ఏమైనా చేయగలదని కూడా మోదీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News